సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (12:14 IST)

మాజీ సైనికుడిగా నా రక్తం మరిగిపోతోంది : వీకే సింగ్

ఒక దేశ మాజీ సైనికుడిగా నాలోని రక్తం మరిగిపోతోందని భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిపై వీకే సింగ్ స్పందించారు. 
 
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఆయన సంతాపం వ్యక్తంచేశారు. ఈ ఘటనను ఉగ్రవాదుల పిరికి చర్యలా అభివర్ణించారు. ఓ పౌరుడిగా, సైనికుడిగా ఉగ్రవాదుల దురాగతాన్ని తలచుకుంటుంటే తన రక్తం మరిగిపోతోందని, ప్రతి రక్తపు బొట్టుకు ఉగ్రవాదులు ప్రతిఫలాన్ని అనుభవిస్తారని హెచ్చరించారు. జవాన్ల త్యాగాలకు 'సెల్యూట్' చేస్తున్నానని వీకే సింగ్ అన్నారు. 
 
మరోవైపు ఈ దాడిపై సీఆర్పీఎఫ్ డీజీ భట్నాగర్ మాట్లాడుతూ, పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ఘటనా స్థలికి ఉన్నతాధికారులు వెళ్లారని, గాయపడ్డ జవాన్లను ఆసుపత్రులకు తరలించినట్టు చెప్పారు. జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతున్న సీఆర్పీఎఫ్‌కి చెందిన 78 వాహనాల శ్రేణిలో 2500 మంది జవాన్లు ఉన్నారని చెప్పారు. సెలవుల అనంతరం విధులకు హాజరయ్యేందుకు వారు వెళ్తుండగా ఈ దారుణం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.