1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 మే 2025 (20:02 IST)

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

farooq abullah
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నానాటికీ పెరిగిపోతున్నాయని, రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం సంభవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదులు దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. 
 
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. రేపు ఏమి జరగబోతుందో ఎవరికీ తెలియదని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
కాశ్మీర్‌లో భద్రతా లోపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఫరూక్ అబ్దుల్లా ప్రస్తావించారు. పహల్గాం దాడి జరగడానికి భద్రతా నిఘా వైఫల్యాలు కూడా కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధానికి నివారించాలంటే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, దాని వెనుక ఉన్న శక్తులను వీలైనంత త్వరగా గుర్తించి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.