పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్.... ఉగ్రవాదుల ఏరివేతకు సైనికసాయం...
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు అవసరమైన సైనిక సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పాకిస్థాన్ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. లేనిపక్షంలో పాకిస్థాన్ ముక్కలు కాకతప్పదని ఆయన జోస్యం చెప్పారు.
హర్యానాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తూ, 'నేను పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఒక సలహా ఇవ్వదలచుకున్నాను. మీరు నిజంగానే ఉగ్రవాదంపై పోరాడేందుకు సిద్ధమంటే మీకు మేము సహకరించేందుకు ముందుంటాం. ఒకవేళ మా సైనిక సహకారం కోరుకున్నా మేము వారిని పాకిస్థాన్ పంపించేందుకు సిద్ధమే' అని సభా ముఖంగా ప్రకటించారు.
ఇప్పటికీ ఇమ్రాన్ పదేపదే కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మరచిపోవాలని, మీరు ఎంత ఆలోచించినా ఏం జరగదన్నారు. మాపై ఎవరూ ఒత్తిడి తెచ్చినా తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు. 1947లో మీరు భారత్‌ను రెండుగా విడగొట్టారు. ఆ తర్వాత 1971లో మీ దేశం రెండు ముక్కలైంది. ఇప్పుడు మళ్లీ సందర్భం వస్తే మీ దేశం విడిపోయే పరిణామాలను ఏ శక్తీ ఆపలేదని రాజ్‌నాథ్ జోస్యం చెప్పారు.