బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలం: నలుగురు అరెస్ట్
బెంగళూరులో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఓ డేటింగ్ యాప్‌లో అమ్మాయితో పరిచయం పెంచుకొని, ఆమెను డిన్నర్‌కు ఆహ్వానించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మార్చి 24వ తేదీన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ కర్ణాటక రాజధానిలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో 2020 సంవత్సరం నుంచి నర్సుగా పని చేస్తున్నారు.
ఇదే పట్టణంలో రజత్ సురేష్, యోగేష్ కుమార్ దలాల్, శివరానా టెక్ చంద్రనా, దేవ్ సరోహా అనే యువకులు ఉంటున్నారు. వీరంతా సంజయ్‌నగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే ఇందులో రజత్ అనే యువకుడు ఓ డేటింగ్ యాప్ లో ఆ నర్స్ తో స్నేహం చేశారు. దీంతో వారు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు.
ఈ పరిచయంతో మార్చి 24వ తేదీన రాత్రి ఒక రెస్టారెంట్‌లో ఆమెను డిన్నర్‌కి పిలిచాడు. రెస్టారెంట్‌లో డిన్నర్ చేసిన తరువాత అతడు ఆమెను తన అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఆమెపై అక్కడ నలుగురు స్నేహితులు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి మార్చి 25వ తేదీన సంజయ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నలుగురు నిందితులపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 376డి కింద కేసు నమోదు చేశారు.
దీంతో పోలీసులు వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను వివిధ ప్రాంతాలలో పోలీసులు అరెస్టు చేశారు.