శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 మార్చి 2022 (18:49 IST)

హర్యానాలో మాయలేడి మోసాలు.. మూడు నెలల్లో ఆరు పెళ్లిళ్లు

హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లాలో ఓ మాయలేడి మోసాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. గత మూడు నెలల్లో ఆరు పెళ్లిళ్ళు చేసుకున్నారు. తొలుత సతీశ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఈ మాయలేడీ... ఆ తర్వాత జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నెల 26వ తేదీ వరకు ఏకంగా ఆరు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ మాయలేడీని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖేదీ కరమ్ షామ్లి ప్రాంతానికి చెందిన సతీశ్‌ను పెళ్లి చేసుకున్న ఈ కిలేడీ లేడి.. అక్కడ నుంచి వరుస పెళ్లిళ్లు చేసుకుంటూ వచ్చారు. ఈ యేడాది జనవరి 1న రాజస్థాన్‌లో రెండో వివాహం, ఫిబ్రవరి 15న మూడో వివాహం, మరో ఆరు రోజుల తేడాతో రాజేందర్ అనే వ్యక్తితో నాలుగో పెళ్లి చేసుకుంది. ఇక కుటానా ప్రాంతానికి చెందిన గౌరవ్‌ను ఐదో పెళ్లిచేసుకున్న మాయలేడి... కర్నాలకు చెందిన సందీప్‌తో ఆరో పెళ్లిని, ఈ నెల 26వ తేదీన బుద్వా ప్రాంతానికి చెందిన సుమిత్‌తో ఏడో వివాహం చేసుకుంది. 
 
నిజానికి ఈ మాయలేడికి గతంలోనే తొలి వివాహం జరిగింది. ఆ తర్వాత మోసాలబాట పట్టిన ఈమె పట్టుబట్టి మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పెళ్లికాని యువకులే లక్ష్యంగా తన దందాను కొనసాగించింది. ఈమె నాలుగో భర్త రాజేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువతిని, ఆమెకు సహకరిస్తున్న మరికొందరిని అరెస్టు చేశారు. అయితే, ఈ నిత్య పెళ్లికూతురు పేరు అంజు. ఈమెకు సహకరించిన మ్యారేజ్ ఏజెంట్లను అరెస్టు చేశారు.