మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 23 జులై 2024 (11:27 IST)

ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. సైనికుడు మిస్సింగ్!!

INS Brahmaputra
ఇండియన్ నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో సోమవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నౌక బాగా ధ్వంసమైంది. ఓ నావికుడు గల్లంతయ్యాడు. నిర్వహణ పనుల కోసం ముంబై డాక్‌లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జూనియర్ సైలర్ కోసం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం తర్వాత నౌక ఓ వైపు ఒరిగిపోతున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం సంభవించిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
 
ఒకవైపు మునిగిపోతున్న నౌకను తిరిగి యథాతథస్థితికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని నేవీ అధికారులు తెలిపారు. అది ఒకవైపు ఒరిగిపోతూనే ఉందని తెలిపింది. ఒక్క జూనియర్ సైలర్ తప్ప మిగతా అందరినీ రక్షించామని, గల్లంతైన నావికుడి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది. ఈ ప్రమాదంపై నేవీ విచారణకు ఆదేశించింది. తాజా ఘటనతో కలిపి గత 11 యేళ్లలో మూడు నౌకలు మునిగిపోయాయి. 2013లో ఐఎన్ఎస్ సింధురక్షక్, 2016 ఐఎన్ఎస్ బెత్వా నౌకలు మునిగిపోయాయి. 
 
కాగా, దేశీయంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక అయిన ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర.. క్లాస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ మొదటిది. ఏప్రిల్ 2000లో దీనిని నేవీలోకి ప్రవేశపెట్టారు. ఇందులో 40 మంది అధికారులు, 330 మంది సైలర్లు ఉంటారు. మధ్యశ్రేణి, క్లోజ్ రేంజ్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లు, ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణలు, టార్పెడో లాంచర్లతో బలమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉంది. దీంట్లో సముద్రం నుంచే అన్ని కోణాల్లోనూ నిఘాపెట్టగల సెన్సార్లు ఉన్నాయి. అంతేకాదు, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఈ యుద్ధనౌక బరువు 5,300 టన్నులు. పొడవు 125 మీటర్లు. 27 నాటికన్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు.