ముంబై మెట్రోలో జర్నీ చేయాలంటే కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి
దేశ ఆర్థిక రాజధాని ముంబై మెట్రోలో జర్నీ చేయాలంటే ఇక తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి. గురువారం నుంచి ముంబైలో అన్ని లోకల్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో లోకల్ రైలు సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్న దృష్ట్యా గతంలో మాదిరిగా పూర్తి సామర్థ్యంతో నడుపాలని నిర్ణయించారు. అయితే, ప్రభుత్వం రైలులో ప్రయాణించే వ్యక్తులకు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా రెండు డోసుల టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది.
టీకా తీసుకోని వారిని రైలులో ప్రయాణించేందుకు అనుమతించరు. ఇంతకు ముందు ఆగస్ట్‌లో కొవిడ్ టీకా రెండో డోస్ తీసుకున్న తర్వాత 14 రోజులు పూర్తి చేసుకున్న వారికి ముంబైకర్లకు మాత్రమే రైళ్లలో ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం సెంట్రల్ రైల్వే, పశ్చిమ రైల్వేలో రద్దీని తగ్గించేందుకు రోజువారీ టికెట్లకు బదులుగా టీకాలు వేసిన ప్రయాణికులకు నెలవారీ పాస్‌లు జారీ చేస్తున్నాయి.
ఈ నెల 28 నుంచి ముంబైలో సబర్బన్ సేవలు వంద శాతం సామర్థ్యంతో నడుస్తాయని ఆయా రైల్వేలు తెలిపాయి. అయితే సాధారణ ప్రజలకు ప్రస్తుతం ఉన్న ప్రయాణ పరిమితులు మారవని స్పష్టం చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మార్చి 22 నుంచి సబర్బన్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు.. రైల్వేమంత్రిత్వ శాఖ జూన్ 15 నుంచి సర్వీస్ వర్గాల వారికి పలు మార్గాల్లో నడిపేందుకు అనుమతి ఇచ్చింది.