జీ-20 సదస్సులో పాల్గొన్న రామ్ చరణ్ - ఘన స్వాగతం పలికిన అధికారులు
జమ్మూకాశ్మీర్ వేదికగా జరుగుతున్న జీ-20 సదస్సులో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాల్గొన్నారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ప్రాతినిథ్యం వహిస్తూ సోమవారం ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కాశ్మీర్‌లో ఆర్టికల్-370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రసిద్ధ దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్-ఏ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ సదస్సు జరుగుతోంది. సోమవారం మొదలైన ఈ సదస్సు ఈ నెల 24వ తేదీ వరకు జరగనుంది. పర్యాటక, వాణిజ్యరంగాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్' తర్వాత రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఛేంజర్'లో నటిస్తున్నారు. శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. దిల్‌రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.