శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (09:52 IST)

ఎన్డీయే కూటమికి షాక్.. అదునుచూసి దెబ్బకొట్టిన జీజేఎం!

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి నుంచి మరో మిత్రపక్షం వైదొలగింది. ఇప్పటికే తెలుగుదేశం, శివసేన, శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆ కూటమికి గుడ్‌బై చెప్పగా, ఇపుడు మరో ప్రాంతీయ పార్టీ అయిన్ గోరఖ్ జనముక్తి మోర్చా (జీజేఎం) ఎన్డీయే కూటమి నుంచి నిష్క్రమించింది. 
 
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో లాగైనా విజయం సాధించాలని చూస్తున్న బీజేపీకి ఇది ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. 
 
గత 2017 నుంచి కొంతకాలంగా అజ్ఞాతంలో వున్న జీజేఎం చీఫ్ బిమల్ గురుంగ్ బుధవారం బయటకువచ్చి, తాము ఎన్డీయేను వీడుతున్నట్టు ప్రకటించారు. పైగా, డార్జిలింగ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న ఈయన... ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీతో కలిసి ముందుకు సాగుతామని ప్రకటించారు.
 
మరోవైపు, డార్జిలింగ్ పర్వతశ్రేణి అభివృద్ధిని కేంద్రం విస్మరించిందన్న బిమల్.. 11 గోరఖ్ సముదాయాలను బలహీన వర్గాల జాబితాలో చేరుస్తామన్న హామీని తుంగలో తొక్కిందని ఆరోపించారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా, టీఎంసీకి అనుకూలంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
 
కాగా, శిరోమణి అకాలీదళ్‌లా జీజేఎంకు పార్లమెంటులో ఎంపీలు లేరు. హత్య, యూఏపీఏ కేసులు ఎదుర్కొంటూ మూడేళ్లుగా పరారీలో ఉన్న గురుంగ్ బుధవారం మీడియా ముందుకు వచ్చారు. 12 ఏళ్లగా కూటమిలో ఉంటున్న తాము ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నట్టు చెప్పారు. బీజేపీ తమను మోసం చేసిందని ఆరోపించారు.