సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (16:29 IST)

గాడిదలు గర్భందాల్చితే సీమంతాలు.. పిల్లలు పుడితే బారసాలాలు కూడా.. ఎక్కడ...!?

donkey
గర్భందాల్చిన గాడిదలకు సీమంతాలు చేస్తున్నారు. వాటి పిల్లలకు బారసాలలు నిర్వహిస్తున్నారు. ఈ విచిత్ర ఆచారం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత వాసులు ఇలా చేయడానికి ప్రధాన కారణం లేకపోలేదు. హలరీ అనే గాడిద జాతి అంతరించి పోయే పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ జాతి గాడిదలను కాపాడేందుకు ఆ ప్రాంత ప్రజలు వింతగా సీమంతాలు చేస్తున్నారు. 
 
ఈ జాతి గాడిదల సంఖ్యను పెంచేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అందుకే ఈ జాతి గాడిదలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పైగా ఆ గాడిదలకు పుట్టే పిల్లలకు బారసాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మన గృహాల్లో ఏ విధంగా శుభకార్యాలు చేస్తారో అదేవిధంగా ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 
 
కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకాలోని కోల్కి అనే గ్రామంలో హరరీ జాతి గాడది ఈనింది. దీంతో ఆ గ్రామ వాసులు సంబరాలు చేసుకున్నారు. పశువులు కాపరులు, ఇతరులు కలిసి బారసాల చేశారు. గర్భందాల్చిన మరో 33 గాడిదలకు కూడా సీమంతం కూడా చేశారు. నుదిటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజ చేసి, ఆహారం వడ్డించారు. 
 
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాలా కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కాగా, ప్రస్తుతం హలరీ జాతి గాడిదలు గుజరాత్ రాష్ట్రంలో కేవలం 417 మాత్రమే ఉన్నాయి.