గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 సెప్టెంబరు 2024 (10:08 IST)

హర్యానా ఎన్నికల తేదీల్లో మార్పు.. ఎందుకని?

election commission of india
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీని అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5కి వాయిదా వేసింది. శతాబ్దాల నాటి బిష్ణోయ్ కమ్యూనిటీ పండుగను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇప్పుడు అక్టోబర్ 4న కాకుండా అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 
 
ఒక రాష్ట్ర ఫలితాలు ఇతర రాష్ట్రాల ట్రెండ్‌లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ తేదీలలో కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మూడో, చివరి దశతో పాటు హర్యానా ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. 
 
తమ గురు జంభేశ్వర్‌ను స్మరించుకుంటూ 300-400 ఏళ్ల నాటి ఆచారాన్ని కొనసాగిస్తున్న బిష్ణోయ్ కమ్యూనిటీ ఓటింగ్ హక్కులు, సంప్రదాయాలను గౌరవించేందుకు హర్యానా ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది.
 
కాగా, హర్యానా ప్రజలు తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమావాస్య పండగను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో తేదీలు మార్చినట్లు ఈసీ వెల్లడించింది.