నారా చంద్రబాబు నాయుడి రిమాండ్ గడువు పొడిగింపు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ క్రమంలో ఆయన రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది. చంద్రబాబును రెండురోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది.
ఆదివారంతో రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు బాబు రిమాండ్‌ను అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించడంతో.. మరో 11 రోజుల పాటు బాబు రిమాండ్‌లో వుంటారు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టడం కోసం మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరడంతో ఏసీబీ న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది.
ఇప్పటికే సీఐడీ రెండు రోజుల పాటు వీకెండ్‌లో తమ కస్టడీకి తీసుకుని బాబును విచారించిన సంగతి తెలిసిందే. కస్టడీ సైతం ఆదివారంతో ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. ఇకపోతే.. సోమవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపనున్నట్లు సమాచారం.