మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 జనవరి 2022 (18:37 IST)

online games ఆడి అప్పుల్లో ఇరుక్కున్నాడు, అడిగినందుకు భార్యాపిల్లల్ని చంపేసి...

వ్యసనం అనేది ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. అందులో ఇరుక్కున్నవారికి మానవత్వం నశించి మృగంలా మారిపోతారు. అలాంటి స్థితిలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లల్ని కడతేర్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నైలోని పెరుంగుడి పెరియార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో మణికంఠన్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఇతడు గత రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు.

 
ఇందుకోసం డబ్బును పెట్టి రాబట్టాలని చూసాడు. ఐతే ఆ గేమ్ ఆడుతూ వున్న డబ్బు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా తనకు తెలిసిన వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేసాడు. ఈ విషయమై అతడిని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భార్యను హత్య చేసేసాడు.

 
ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల్ని కూడా దారుణంగా చంపేసి అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 31వ తేదీ జరగ్గా, తెల్లవారినా తలుపులు తీయకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్టుమెంట్ తలుపులు తెరిచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.