బొమ్మ తుపాకీ అనుకుని కాల్చుకున్నాడు.. చివరకు ఏమైందంటే...?
బర్త్ డే పార్టీ కి వెళ్లిన ఓ యువకుడు అక్కడున్న తుపాకీని చూశాడు. బొమ్మ తుపాకీ అనుకుని సరదాగా పోజు ఇద్దామనుకుని కాల్చుకున్నాడు. కానీ అదే అతనో చివరి పోజైపోయింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని షాహాపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే...
అటగావ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో శుక్రవారం రాత్రి ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్ జనగం (28) ఈ వేడుకలకు హాజరయ్యాడు.
అదే సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్న వ్యక్తి నివాసంలో తుపాకి కనిపించడంతో.. బొమ్మ తుపాకి అని భావించి కాల్చుకున్నాడు.
తుపాకి నుండి బుల్లెట్ సిద్ధేశ్ శరీరంలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి అందరూ అక్కడికి చేరుకునే సమయానికి సిద్ధేశ్ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.