శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (16:05 IST)

వ్యాయామం అక్కర్లేదు.. అర్థగంట సైకిల్ తొక్కితే చాలు...

నేటికాలపు యువత వ్యాయామానికి పూర్తిగా దూరమైపోతోంది. శారీరకశ్రమ అంటే ఏంటో తెలియకుండా జీవిస్తున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే బైక్. బండి లేనిదే వీధి చివరకు కూడా వెళ్లనంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో వ్యాయామం చేయలేనివారు రోజుకు అర్థగంట పాటు సైకిల్ తొక్కితే చాలట. అలా చేయడం ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చంటున్నారు వైద్యులు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తం కదులుతుంది. దీంతో దాదాపు అన్ని భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. 
 
ముఖ్యంగా, ఊబకాయంతో అవస్థపడేవారు గణనీయంగా బరువు తగ్గిపోతారు. మధుమేహంతో ఉన్నవాళ్లు సైక్లింగ్ చేస్తే షుగర్ లెవల్స్ అందుపులో ఉంటాయి. ప్రతి రోజూ 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే 60 శాతం వరకు మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 
 
అలాగే సైక్లింగ్‌తో హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. సైకిల్ తొక్కుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోడం, వదలడం వేగంగా చేస్తారు. కాబట్టి శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు పోతాయి. 
 
కీళ్ల నొప్పులు ఉన్న వాళ్లు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సైక్లింగ్ చేస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఫలితంగా ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తగ్గుతాయని సైక్రియాట్రిస్టులు చెబుతున్నారు. అలాగే మెదడు పనితీరు మెరుగుపడి.. జ్ఞాపక శక్తి పెరుగుతుందని అంటున్నారు.