సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (10:14 IST)

హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.. ఇద్దరు వ్యక్తులు మృతి

Howrah-CSMT Express train
Howrah-CSMT Express train
జార్ఖండ్‌లో ముంబైకి వెళ్లే రైలు 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. మంగళవారం హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12810) జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌లోని జంషెడ్‌పూర్ నుండి 80 కి.మీ దూరంలో రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్‌ల మధ్య తెల్లవారుజామున 4 గంటలకు పట్టాలు తప్పింది.
 
రైల్వే బృందాలు రెస్క్యూ -రిలీఫ్ ఆపరేషన్లలో నిమగ్నమై ఉన్నాయి. చాలా మంది గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చక్రధర్‌పూర్ రైల్వే డివిజన్‌కు చెందిన సీనియర్ అధికారులు, సహాయక రైలుతో పాటు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.
 
చక్రధర్‌పూర్ డివిజన్ సీనియర్ డీసీఎం (డివిజనల్ కమర్షియల్ మేనేజర్) ఆదిత్య కుమార్ చౌదరి ప్రమాదాన్ని ధృవీకరించారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు మరణించారు. గాయపడిన వారిని బస్సులలో ఆసుపత్రులకు తరలించారు.
 
ప్రమాదం కారణంగా సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని టాటానగర్-చక్రధర్‌పూర్ సెక్షన్‌లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపబడుతున్నాయి. పట్టాలు తప్పిన కోచ్‌లను తొలగించి, చిక్కుకున్న ప్రయాణికులను రక్షించే ప్రక్రియ క్రేన్లు, ఇతర యంత్రాల సహాయంతో కొనసాగుతోంది.
 
ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. అకస్మాత్తుగా, అనేక కోచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి పట్టాలు తప్పడంతో పెద్ద శబ్ధం, కుదుపులు సంభవించాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీయడంతో రైలు లోపల భయాందోళనలు నెలకొన్నాయి. పై బెర్త్‌లపై నిద్రిస్తున్న పలువురు ప్రయాణికులు కిందపడిపోవడంతో సామాన్లు ఎక్కడికక్కడ పడి ఉన్నాయి.