గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జులై 2020 (14:43 IST)

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ ఎన్నికల్లోనూ పోటీ చేయను: ఒమర్ అబ్దుల్లా

జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం ఉన్నంత వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శపథం చేశారు.

‘‘అత్యధిక కాలం అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ఉన్నా. అంతేకాకుండా అసెంబ్లీలో ఆరు సంవత్సరాలుగా నాయకుడిగా ఉండి నడిపించా. అంత బలంగా ఉన్న నేను... ఇంత బలహీనమైన, అధికారం లేని సభలో సభ్యుడిగా ఉండలేను’’ అని స్పష్టం చేశారు.

జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించే అంశం తమ పార్టీకి షాక్ లాంటిదే అని ఆయన ఒప్పుకున్నారు. ఇలా చేయడం ద్వారా జమ్మూ కశ్మీర్ ప్రజలను కేంద్రం తీవ్రంగా అవమానించిందని, ప్రజలకు ఓ రకంగా శిక్ష వేశారని తీవ్రంగా మండిపడ్డారు.

కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు ప్రకటించారో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంత హోదా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, సంపూర్ణ రాష్ట్ర హోదా అనేది త్వరలోనే ప్రకటిస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.