అందమైన భామలతో ఎర.. హనీ ట్రాప్.. ముగ్గురు నేవీ ఉద్యోగుల అరెస్ట్
భారత నౌకాదళానికి చెందిన రహస్యాలను వెల్లడించారనే అభియోగాలపై మరో ముగ్గురు నేవీ ఉద్యోగులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఇందుకు అందమైన అమ్మాయిలను పాకిస్థాన్ ఎరగవేయడమే ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. అందానికి ముచ్చటపడి.. వారికి లొంగిపోయి.. వారికి భారత నౌకాదళానికి చెందిన రహస్యాలను వెల్లడించారని అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
వీరు ముగ్గురూ విశాఖపట్నంలో నేవీ ఉద్యోగులుగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో మరికొందరు నేవీ సెయిలర్స్ కూడా ఉన్నట్టు అనుమానాలున్నాయి. దీంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఫేస్ బుక్ ద్వారా నేవీ ఉద్యోగులకు అమ్మాయిలను పరిచయం చేసిన పాకిస్థాన్, వారి వద్దకు అమ్మాయిలను పంపి, సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలను తీసి, వాటిని చూపిస్తూ బెదిరింపులకు దిగి, ఆపై నౌకాదళ సమాచారాన్ని వారి నుంచి రాబట్టుకున్నట్లు తేలింది.
'ఆపరేషన్ డాల్ఫిన్ నోస్' నిక్ నేమ్‌తో జరిగిన ఆపరేషన్‌లో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హనీ ట్రాప్‌లో మరికొందరు సెయిలర్స్ కూడా ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.