2100 నాటికి 41 కోట్లు పడిపోనున్న భారత్ జనాభా, చైనా జనాభా ఎంత వుంటుందో తెలుసా?
ప్రపంచంలో జనాభా భారీగా పెరిగిపోతున్న దేశాల్లో భారత్ ఒకటి. 2030 తర్వాత దేశంలో అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద దేశంగా అవతరించనుందనే వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో 2100 సంవత్సరానికి భారతదేశ జనాభా కూడా గణనీయంగా తగ్గిపోనుంది. 2100 నాటికీ ఈ జనాభా సంఖ్య 100 కోట్లకు చేరుకుంటుందని జనాభా లెక్కల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే వచ్చే 78 యేళ్ళలో భారత్‌లో జనాభా 41 కోట్ల మేరకు తగ్గిపోనుంది. అంటే 100 కోట్లకు పరిమితంకానుందని స్టాన్ ఫోర్డ్ అధ్యయనంలో వెల్లడైంది.
ప్రస్తుతం భారత్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు 476 మంది జీవిస్తున్నారు. చైనాలో ఇది కేవలం 148గానే ఉంది. 2100 నాటికి భారత్‌లో జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 335కు తగ్గుతుంది.
అయితే, ఈ జనాభా క్షీణత ఒక్క భారత్‌లోనే కాదు.. చైనా, అమెరికా దేశాల్లో కూడా కనిపిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది. 2100 నాటికి చైనా జనాభా 93 కోట్లు తగ్గిపోయి 49.4 కోట్లకు పరిమితమవుతుంది. ఈ లెక్కలను ఆ దేశ సంతానోత్పత్తి ఆధారంగా లెక్కించారు.
అలాగే, భారత్‌లో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం ఒక మహిళకు సగటున 1.79 జననాలుగా ఉంటే 2100 నాటికి ఇది 1.19గా తగ్గనుంది. అంటే ఒక మహిళ సగటున ఒకరికే జన్మినివ్వనుంది. దేశాలు సంపన్న దేశాలుగా మారితే ఒక బిడ్డకు జన్మినివ్వడం సహజమేనని ఈ అధ్యయనం వెల్లడించింది.