గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 ఆగస్టు 2022 (11:47 IST)

ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీగార్డుపై చేయి చేసుకున్న కోపిష్టి (Video)

slapping
గురుగ్రామ్‌లోని ద క్లోజ్ నార్తో సొసైటీలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో తన ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీ గార్డుతో పాటు.. లిఫ్టు మెకానిక్‌పై ఓ కోపిష్టి చేయి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ ఫుటేజీ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. లిఫ్టులో చిక్కునిపోయిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన సెక్యూరిటీగార్డు, లిఫ్టుమ్యాన్‌లపై ఇంటి యజమాని చేయిచేసుకోవడాన్ని పలువురు నెటిజన్లు తూర్పారబడుతున్నారు. 
 
ఈ సొసైటీలో వరుణ్ నాథ్ అనే వ్యక్తి 14వ అంతస్తులో ఉంటున్నారు. ఈయన కిందకు దిగుతున్న సమయంలో లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో వరుణ్ నాథ్ లిఫ్టులో చిక్కునిపోయాడు. దీంతో సెక్యూరిటీ గార్డుకు ఇంటర్‌కామ్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో సెక్యూరిటీ గార్డు అశోక్‌ తనతో పాటు లిఫ్ట్‌మ్యాన్‌ను సంఘటనా స్థలానికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత లిఫ్ట్ మెకానిక్ ఐదు నిమిషాల్లో లిఫ్టు డోర్స్ ఓపెన్ చేయడంతో వరుణ్ నాథ్ సురక్షితంగా బయటకు వచ్చాడు. 
 
అయితే, లిఫ్టు మధ్యలో ఆగిపోవడంతో చిర్రెత్తుకొచ్చిన వరుణ్ నాథ్ లిఫ్టు నుంచి బయటకురాగానే సెక్యూరిటీగార్డు రెండు చెంపలు చెళ్ళుమనిపించాడు. ఆ తర్వాత మెకానిక్‌పై కూడా చేయి  చేసుకున్నాడు. ప్రాణాలు కాపాడిన వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పాల్సిన వ్యక్తి వారిని కొట్టడం ఏమిటంని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, సెక్యూరిటీగార్డు ఫిర్యాదు మేరకు గురుగ్రామ్ పోలీసులు నిందతుడు వరుణ్ నాథ్‌పై ఐపీసీ 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.