మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2020 (17:12 IST)

తిరునెల్వేలిలో ఇరుట్టుకడై హల్వా యజమాని ఆత్మహత్య!

తమిళనాడు రాష్ట్రంలో లభించే తినుబండరాల్లో హల్వా ఫేమస్. ముఖ్యంగా, తిరునెల్వేలోని ఇరుట్టుకడైలో లభించే హల్వాకు ప్రత్యేక గుర్తింపువుంది. దీన్ని తిరునెల్వేలి హల్వా అని పిలుస్తుంటారు. ఎవరైనా నెల్లైకు వెళితే వారు ఈ హల్వాను తమ వెంట తీసుకుని రాకుండా ఉండరు. అంతటి ఫేమస్... తిరునెల్వేలి ఇరుట్టుకడై హల్వా. అయితే, ఈ హల్వా దుకాణం యజమాని హరిసింగ్ (75) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
తిరునల్వేలి నగరం నడిబొడ్డున నెల్లయప్పర్‌ ఆలయం సమీపంలో వున్న ఈ హల్వా దుకాణాన్ని 1940లో రాజస్థాన్‌కు చెందిన బిజిలీసింగ్‌ అనే వ్యక్తి  ప్రారంభించాడు. చిన్న బడ్డీకొట్టులా ఉండే ఆ దుకాణంలో వేడివేడిగా రోజు తయారయ్యే హల్వా కోసం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జనం పోటెత్తేవారు. 
 
ప్రస్తుతం ఆ దుకాణాన్ని బిజిలీ సింగ్‌ మూడో తరానికి చెందిన హరిసింగ్‌ నడుపుతున్నాడు. గత పదేళ్లుగా హరిసింగ్‌ నేతృత్వంలో ఆ దుకాణంలో తయారయ్యే హల్వా దేశవిదేశాలకు కూడా ఎగుమవుతోంది.  ఈ నేపథ్యంలో ఇటీవల హరిసింగ్‌ అల్లుడు గోపాల్‌ సింగ్‌కు పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. వెంటనే అతడు ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 
 
దీంతో భయాందోళనలకు లోనైన హరిసింగ్‌ అస్వస్థతకు గురై పాళయంకోటలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజులకు ముందు హరిసింగ్‌కు కూడా ఆరోగ్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. గురువారం ఉదయం అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన హరిసింగ్‌ తాను చికిత్స పొందుతున్న ఆస్పత్రి గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.