గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు ఆ పేరు పెట్టడంలో తప్పు లేదు : ఇస్రో ఛైర్మన్

somnath
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంలా జాబిల్లి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి "శివ్‌శక్తి" (శివ్‌స్థల్) అనే పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టడంలో ఎలాంటి తప్పు లేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం తిరువనంతపురంలో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తద్వారా సైన్స్‌తో పాటు ఆధ్యాత్మికం పట్ల తనకు ఆసక్తి ఉందని తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రుడికి సంబంధించి ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశమూ తీయని అద్భుతమైన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అవి తమ కంప్యూటర్ కేంద్రానికి వెళుతున్నాయని చెప్పారు. ఈ ఫోటోలను అక్కడి శాస్త్రవేత్తుల ప్రాసెస్ చేస్తున్నారని, వీటిని త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. 
 
అదేసమయంలో జాబిల్లిపై ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు విజయవంతంగా తమ పనిని చేస్తున్నాయని చెప్పారు. కొన్ని పరిశోధనల్లో భాగంగా, రోవర్ ఖచ్చితంగా వేర్వేరు ప్రదేశాలకు వెళ్లవలసి వుందని తెలిపారు. వచ్చే 10 రోజుల్లో ల్యాండర్, రోవర్‌లు అన్ని పరిశోధనలను పూర్తి చేస్తాయని నమ్ముతున్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో విక్రమ్‌ ల్యాండర్‌ దిగిన చోటుకు 'శివ్‌శక్తి' అనే పేరును ప్రధాని నరేంద్ర మోడీ పెట్టడాన్ని సోమనాథ్‌ సమర్థించారు. శివ్‌శక్తి, తిరంగా (చంద్రయాన్‌-2 కూలిన ప్రదేశానికి పెట్టిన పేరు) రెండు పేర్లూ భారతీయతకు చిహ్నమన్నారు. చంద్రుడితోపాటు అంగారక, శుక్ర గ్రహాల వద్దకు వ్యోమనౌకలను పంపే సత్తా భారత్‌కు ఉందని సోమనాథ్‌ స్పష్టం చేశారు. ఈ పరిశోధనల కోసం మరిన్ని పెట్టుబడులు అవసరమని తెలిపారు.