బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (12:51 IST)

'కుమార' సర్కారుపై బాంబు పేల్చిన దేవెగౌడ

కర్ణాటక రాష్ట్రంలో తన కుమారుడు హెచ్.డి. కుమార స్వామి సారథ్యంలోని కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుపై మాజీ ప్రధాని దేవెగౌడ బాంబు పేల్చారు. కర్ణాటక రాష్ట్రంలోని సంకీర్ణ సర్కారు ఎపుడైనా కూలిపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు జరగే సూచనలు లేకపోలేదన్నారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్ సారథ్యంలోని సంకీర్ణ సర్కారు కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం కూడా బొటాబొటి మెజార్టీతో ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా కృషి చేస్తోంది. దీంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సమయం సరిపోతుంది. ఫలితంగా పాలనపై దృష్టిసారించలేకపోతున్నారు.
 
ఈ పరిణామాలన్నింటిపై దేవెగౌడ స్పందిస్తూ, కర్ణాటకలో త్వరలోనే మధ్యంతర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. 'మా ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఆ పార్టీ నేతల చర్యలు, ప్రవర్తన అందుకు అనుగుణంగా లేదు. మా ప్రజలు చాలా తెలివైన వాళ్లు. కాంగ్రెస్ నేతల చర్యలను వాళ్లు గమనిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. 
 
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో తనకు తెలియదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతీ డిమాండ్‌ను జేడీఎస్ నెరవేర్చిందని  గుర్తుచేశారు. కాంగ్రెస్ తన బలాన్ని కోల్పోవడంతోనే లోక్‌సభ ఎన్నికల్లో చిత్తు అయిందని చెప్పారు. తాము కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను నియమించాల్సిందిగా కోరామనీ, కానీ రాహుల్ గాంధీ కుమారస్వామినే పెట్టాలని సూచించారని దేవెగౌడ తెలిపారు.