టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు
జాతీయ భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీకి చెందిన ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, ఈ వివాదంలో పాకిస్థాన్‌కు టర్కీ బాహాటంగా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో జేఎన్‌యూ తీసుకున్న ఈ చర్యకు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.
జేఎన్‌యూ టర్కీలోని ఇనోను విశ్వవిద్యాయం మధ్య ఈ యేడాది ఫిబ్రవరి నెల 3వ తేదీన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం మూడేళ్లపాటు అంటే 2028 ఫిబ్రవరి 2వ తేదీ వరకు అమల్లో ఉండాల్సివుందని జేఎన్‌యూ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, బుధవారం (మే 4వ తేదీ) నుంచే ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
"జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా, టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో జేఎన్‌యూ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేయబడింది. జేఎన్‌యూ దేశానికి అండగా నిలుస్తుంది" అని స్పష్టం చేసింది.
ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై బాధిత పాకిస్థాన్‌తో పాటు చైనా, టర్కీ దేశాలు అసత్య ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. దీంతో భారత్ ఆ రెండు దేశాలకు షాకిచ్చింది. టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రసార సంస్థ టీఆర్టీ వరల్డ్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే, చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్, జిన్హువాలకు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
పాకిస్థాన్ ఉపయోగించిన టర్కీ నిర్మిత డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడినట్టు ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడైన కొద్ది రోజులకే ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. పాకిస్థాన్ చేసిన చొరబాటు యత్నాన్ని భారత సైనికులు తిప్పికొట్టడమేకాకుండా, భారత భూభాగానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకున్నాయి.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత సైన్యం గురించి ధృవీకరించని, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఈ సంస్థలు వ్యాప్తి చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే ఖాతా నిలిపివేయబడింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా @tttworld భారతదేశంలో నిలిపివేయబడింది అనే సందేశం స్క్రీన్‌పై కనిపిస్తోంది.
ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలు, శిక్షణా కేంద్రాలపై భారత్ దాడులు చేసి ధ్వంసం చేసిన విషయం తెల్సిందే. ఈ దాడుల తర్వాత టీఆర్టీ వరల్డ్ తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ప్రచారం చేసినట్టు గుర్తించారు.