బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

7 రోజుల్లో 5 కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్ గొగొయి!

స్వలింగ సంపర్కం నేరం కాదు.. ఆధార్ రాజ్యాంగబద్ధమే.. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. భారత 45వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వెలువరించిన సంచలన తీర్పులు.

వీటితో పాటు మరెన్నో సున్నితమైన వ్యాజ్యాలపై తీర్పునిచ్చారు న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా. అయితే వాటిలో చాలా వరకు పదవీ విరమణ చేయడానికి కొద్దిరోజుల ముందు వెలువరించినవే. జస్టిస్ మిశ్రా వారసుడిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రంజన్ గొగొయి అదే దారిలో వెళ్లనున్నారా?

మరో 2 వారాల్లో పదవీ విరమణ చేయనున్న ఆయన.. రాజకీయం, రక్షణ, మతానికి సంబంధించిన పలు కీలక కేసుల్లో తుది తీర్పును వెల్లడించి జస్టిస్ మిశ్రా తరహాలోనే సంచలనం సృష్టించనున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఈ తరుణంలో ఆయన ముందున్న సున్నితమైన ప్రధాన కేసులేంటో చూద్దాం.. కీలకమైన అయోధ్య కేసు జస్టిస్ రంజన్ గొగొయి ముందున్న ప్రధాన కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అయోధ్య వివాదం. ఇటీవలే 40 రోజుల పాటు రోజువారీ విచారణలు ముగిసిన నేపథ్యంలో.. ఈ కేసులో కీలకమైన తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిపై తమదంటే తమదే హక్కు అని సుప్రీంకోర్టులో ఇరువర్గాలు వాదోపవాదనలు వినిపించాయి. ఎంతో సున్నితమైన ఈ కేసులో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 17 లోపు తీర్పు వెలువరిస్తుందని అందరూ భావిస్తున్నారు.