శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 ఏప్రియల్ 2020 (10:56 IST)

మందుల కోసం ఆరాటం.. యువతి టిక్‌టాక్ - స్పందించిన కర్నాటక సీఎం

తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుందని, లాక్‌డౌన్ కారణంగా బయటకెళ్లి మందులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. సాయం చేయండంటూ ఓ యువతి సెల్ఫీ వీడియో చేసి, దాన్ని టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప దృష్టికెళ్లింది. దీంతో ఆయన తక్షణం స్పందించి అధికారులను ఆదేశించగా, అధికారులు ఇంటికెళ్లి నెల రోజులకు సరిపడ మందులు సమకూర్చారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకా, నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళ రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో ఆమె భర్త ఓ కిడ్నీని దానం ఇచ్చారు. జనవరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆపై ఆమె మందులు వాడుతూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. 
 
అయితే, కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఫలితంగా గత 20 రోజులు శాఖవ్వకు కావాల్సిన మందులు దొరకని పరిస్థితి ఏర్పడటంతో, ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె కుమార్తె పవిత్ర, తల్లి బాధను చెబుతూ, టిక్ టాక్ వీడియో చేసింది. ఈ వీడియో వైరల్ అయి, యడియూరప్పను చేరగా, ఆయన సూచనతో, జిల్లా అధికారులు నిన్న శాఖవ్వ ఇంటికి వెళ్లారు. నెల రోజులకు సరిపడా మందులను అందించారు. మరేదైనా సమస్య ఏర్పడితే, తమకు తెలియజేయాలని సూచించారు.