కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు.. నిర్మలా సీతారామన్ విజయం
కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థులు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్, ఎమ్మెల్సీ లేహర్ సింగ్ సిరోయా, జగ్గేశ్ విజయం సాధించారు. ఒక్క స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జైరాం రమేష్ విజయాన్ని అందుకున్నారు.
వాస్తవానికి 15 రాష్ట్రాల పరిధిలోని 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ వెలువడగా.. అందులో 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 సీట్లను శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఐతే అధికారంలో పార్టీలకే అధిక స్థానాలు దక్కాయి.
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను గెలుపొందింది. విపక్ష బీజేపీకి కేవలం 1 సీటు మాత్రమే దక్కింది. క్రాస్ ఓటింగ్‌పై నమ్మకం పెట్టుకున్న జీ మీడియా అధినేత సుభాష్ చంద్రకు నిరాశే ఎదురైంది.
ఇక మహారాష్ట్రలో 6 సీట్లు, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది.
తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్‌లో 4 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఐతే రెండు చోట్లా అధికార పార్టీలకు భారీ మెజారిటీ ఉండడంతో ఆయా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి దివకొండ దామోదర్ రావు, బండి పార్థసారధి రెడ్డి గెలిచారు. ఏపీలో వైసీపీ నుంచి బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య, విజయసాయిరెడ్డి గెలుపొందారు.