శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:30 IST)

ఇస్రో మాజీ శాస్త్రవేత్త నారాయణ్‌కు క్లీన్ చిట్..

చట్టవిరుద్ధంగా చేసిన అరెస్టుతో దశాబ్దాలుగా జాతికి సేవలు అందించే అవకాశం పోయిన ఒక శాస్త్రవేత్తకు ఎట్టకేలకు విముక్తి లభించింది. పోలీసు కస్టడీలో వేధింపులకు గురైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎస్.నంబి నారాయణన్‌కు క్లీన్ చిట్ రావడంతో రూ.1.3 కోట్లు నష్టపరిహారం చెల్లించేందుకు కేరళ కేబినెట్ ఆమోదించింది. వివరాల్లోకి వెళితే నంబి నారాయణన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో శాస్ర్తవేత్తగా పని చేస్తున్నారు.
 
1994 నవంబర్‌లో ఆయన గూఢచర్యానికి పాల్పడి, ఇస్రోకు చెందిన కీలక రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేసారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 1998లో సుప్రీంకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది, అప్పటికే ఆయన తన సహచర శాస్త్రవేత్తలు డి.శివకుమార్ సహా మరో నలుగురితో కలిసి 50 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఈ 50 రోజుల కస్టడీలో తనను పోలీసులు చిత్రహింసలు పెట్టి, తనచే బలవంతంగా తప్పుడు ప్రకటనలు ఇచ్చేలా ఒత్తిడి చేశారని నంబి నారాయణన్ ఆరోపించారు. దీనితో తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ తిరువనంతపురంలోని కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు.
 
నంబి నారాయణన్‌ అనవసరంగా అరెస్టు చేశారని, వేధింపులకు గురి చేశారని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనడంతో పాటు ఆయనపై ఉన్న ఆరోపణలను కొట్టివేసింది. కాగా, ఈ ఏడాది నంబి నారాయణన్‌కు పద్మభూషణ్ అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించగా, ఆ అవార్డును ఆయన స్వీకరించారు. తన సేవలకు ఎట్టకేలకు గుర్తింపు లభించిందని అన్నారు.
 
కోర్టు సైతం ఆయనకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడంతో కేరళ కేబినెట్ ఎట్టకేలకు రూ.1.3 కోట్లు చెల్లించేందుకు ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయంతో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.