శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 27 జనవరి 2020 (16:36 IST)

బ్రియాంట్ మృతి: కోహ్లీ, రోహిత్, కేటీఆర్ దిగ్భ్రాంతి, ట్రంప్, ఒబామా సైతం.....

కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఆకస్మిక మృతికి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. హెలికాప్టర్ కుప్పకూలి మంటల్లో చిక్కుకోవడంతో బ్రియాంట్‌తో పాటు అతని కూతురు కూడా మరణించింది. ప్రమాదంలో మొత్తం 9 మంది మరణించారు. 
 
బ్రియాంట్ మృతికి ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతాపం వ్యక్తం చేశారు. ఈ వార్త వినడం దురదృష్టకరమని, ఇది తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. జీవితమనేది ఊహించలేనిదని, ప్రమాదంలో బ్రియాంట్‌తో పాటు అతని కూతరు మరణించడం కలచివేస్తోందని ఆయన అన్నాడు. 
 
వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అన్నాడు. ఇది యావత్తు క్రీడా ప్రపంచానికి దుర్దినమని, ఒక దిగ్గజాన్ని క్రీడాలోకం కోల్పోయిందని రోహిత్ శర్మ తన ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాలో అన్నాడు. 
 
బ్రియాంట్ , అతని కూతురు గియానా ఆత్మలకు శాంతి కలగాలని ఆయన అన్నాడు. బ్రియాంట్ మరణంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్ బాల్ అభివృద్ధికి విశేషమైన కృషి చేశాడని అన్నారు. అమెరికా క్రీడా చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని వారన్నారు. బ్రియాంట్ మృతికి తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా సంతాపం తెలిపారు.