సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (18:54 IST)

ప్రభుత్వ లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు - ప్రధాని నివాళులు

గాన కోకిల, భారతరత్న లతా మంగేష్కర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ముంబైలోని శివాజీ పార్కులో జరిగిన ఈ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని, లతా మంగేష్కర్‌కు ఆఖరిసారి నివాళులు అర్పించారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా హాజరయ్యారు. 
 
గత నెలలో కరోనా వైరస్ బారినపడిన లతా దీదీ అప్పటి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 
 
ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు న్యుమోనియాతో పాటు అంతర్గత అవయవాలు పాడైపోవడం వల్ల ఆమె చనిపోయారని ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఆమె పార్థివ దేహాన్ని తొలుత ఆస్పత్రి నుంచి ప్రభుకుంజ్‌లోని ఆమె నివాసానికి తరలించారు. ఆ తర్వాత సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. 
 
ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, బాలీవుడ్ స్టార్స్ షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి బడా హీరోలు కూడా పాల్గొని లతా దీదీని కడసారి చూసి నివాళులు అర్పించారు. 
 
ఇదిలావుంటే, లతా మంగేష్కర్ మరణానికి సంతాపంగా జాతీయ పతాకాన్ని రెండు రోజుల పాటు అవనతం చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఆది, సోమవారాలు త్రివర్ణ పతాకాన్ని దేశ వ్యాప్తంగా సగం ఎత్తులోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు.