గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

"చోటా ఆద్మీ బడా కామ్ కరే".. ఈటలకు ప్రధాని మోడీ కితాబు

తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ తరపు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. శభాష్.. ఈటలగారు అంటూ అభినంధించి, ఇక తగ్గకండి.. ఇదే స్ఫూర్తి పట్టుదలతో ముందుకుసాగాలని ఆయన కోరారు. 
 
ప్రధాని మోడీ శనివారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. ఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లే సమయంలో విమానాశ్రయంలో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌పై విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రధాని మోడీకి బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిచయం చేశారు. 
 
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించారని చెప్పారు. ఈ ప్రకటనలను విన్న తర్వాత, ప్రధాని మోడీ ఈటల రాజేందర్‌ను భుజం తట్టి అభినందించారు. "చోటా ఆద్మీ బడా కామ్ కరే" అంటూ కామెంట్స్ చేశారు. 
 
అనంతరం బండి సంజయ్‌తో మాట్లాడిన మోడీ ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయలుదేరారు. ముచ్చింతల్‌లో సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ అంతకుముందు ఇక్రిసాట్ 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.