బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 మే 2020 (10:59 IST)

కరోనా చావుల కంటే.. ఆకలి మరణాలే అధికం.. ఉద్యోగాల్లో కోత..?

దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఆకలి మరణాలతో పాటు ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుందని ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి అన్నారు. దేశంలో లాక్‌డౌన్‌ను పొడగిస్తే కరోనా చావుల కంటే ఆకలి మరణాలే ఎక్కువుగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి తెలిపారు. 
 
దేశంలో సుమారు 19 కోట్ల మంది అసంఘటిత, స్వయం ఉపాధి వల్ల ఉపాధి పొందు తున్నారన్నారు. లాక్‌డౌన్‌ భవిష్యత్తులోనూ కొనసాగితే వీరంతా జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వ్యాపారులు సైతం 15 నుంచి 20 శాతం ఆదాయం నష్టపోవచ్చని అంచనా వేశారు. అనేక అభివద్ధి చెందిన దేశాల కంటే భారతదేశ మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లాక్‌డౌన్‌ ఆంక్షలను ఎక్కువ కాలం కొనసాగించే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. భారత్‌ లాంటి దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగించే పరిస్థితులు లేవన్నారు. 
 
లాక్‌డౌన్‌ పొడిగిస్తే వీరంతా మరింత సంక్షోభంలోకి కూరుకుపోతారని మూర్తి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వ్యాధి అంటకుండా వారిని జాగ్రత్తగా చూసు కుంటూ, సామర్థ్యం ఉన్నవారికి తిరిగి పనిని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
మరోవైపు ప్రస్తుత ఏడాదిలో ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఉండకపోవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ టివి మోహన్‌దాస్‌ పారు కూడా అన్నారు. కరోనా ప్రతికూల ప్రభావమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే హామీ ఇచ్చిన వారికి మాత్రం ఆయా సంస్థలు నియామకాలు కల్పించనున్నాయన్నారు. ఐటీ కంపెనీల క్లయింట్లు కూడా చాలా వరకు తమ కార్యాలయాలను తెరవలేదన్నారు. దీంతో వచ్చే రెండు మూడు త్రైమాసికల వరకు ఎటువంటి నియామాకాలు జరగబోవని చెప్పారు. 
 
ఒక వేళ ఎవరైనా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ స్థానాన్ని భర్తి చేయకపోవచ్చని పారు పేర్కొన్నారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగుల వేతనాల్లో 20-25 శాతం కోత ఉండొచ్చన్నారు. ఇక ఉద్యోగంలో పదోన్నతి ఉన్నప్పటికీ జీతాల పెంపు మాత్రం ఉండకపోవచ్చన్నారు.