గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:49 IST)

డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు విధానాన్ని పాటిద్దాం- కోవిడ్‌ను ఎదుర్కొందాం

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ కేంద్రం అనేక సడలింపులు ఇస్తూ ప్రస్తుతం అన్‌లాక్ 4.0 కొనసాగుతోంది. ఏప్రిల్ నాటి పరిస్థితులతో పోలిస్తే మనుషులపై కోవిడ్ చూపించే ప్రభావం తగ్గినప్పటికీ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. 
 
వ్యాక్సిన్ వస్తుందన్న ప్రచారం జరుగుతున్నా అది ఇంకా ప్రయోగదశలో ఉంది. దీంతో వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి రాకవపోవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తప్పనిసరిగా మాస్కు ధరించడం, బయటకు వెళ్లినపుడు భౌతిక దూరం పాటించడం, తరచూ సబ్బుతోగానీ శానిటైజర్ తో గానీ చేతులను శుభ్రం చేసుకోవడం మరవకూడదు. 
 
ఇందుకోసం Wear a Mask, Wash your Hands, Watch your Distance (W.W.W) విధానాన్ని మరికొంత కాలం మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది.పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
  
మాస్కు ధరించండి (Wear a mask) 
కోవిడ్ మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. 
 
అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి. మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. 
 
చేతులను శుభ్రం చేసుకోండి(Wash your hands)
మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. 
 
అవే వస్తువులను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కోవిడ్ వైరస్ మనకు వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బుతో గానీ, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో గానీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 

వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం. 
 
భౌతిక దూరం పాటించడం గుర్తించుకోవాలి (Watch your Distance)
కోవిడ్ ను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం పాటించడం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. 
 
ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.  
 
పైన సూచించిన విధంగా ప్రతిఒక్కరూ Wear a Mask, Wash your Hands, Watch your Distance (W.W.W) విధానాన్ని పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుదాం. కోవిడ్ మహమ్మారిని జయిద్దాం.