మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (08:40 IST)

జైలు సిబ్బందికి లంచాలు..శశికళకు అరెస్ట్ వారెంట్

ilavarasi
అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో అన్నాడీఎంకే మాజీ నేత శశికళ, ఆమె బంధువు ఇళవరసిలు జైలు శిక్షను అనుభవించారు. ఆ సమయంలో వారిద్దరూ మెరుగైన సౌకర్యాల కల్పన కోసం జైలు అధికారులకు రెండు కోట్ల మేరకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసు విచారణకు వారిద్దరూ హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే, ఈ కేసు విచారణను వచ్చే నెల ఐదో తేదీకి వాయిదా వేసింది.
 
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియ నెచ్చెలి శశికళకు కర్నాటక లోకాయుక్త కోర్టు ఈ అరెస్టు వారెంట్ జారీచేసింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో తమ గదిలో మెరుగైన సౌకర్యాల కల్పన కోసం జైలు అధికారులకు లంచమిచ్చినట్టు శశికళ, ఇళవరసిలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 
 
జైలు అధికారులకు రూ.2 కోట్ల మేరకు లంచం ఇచ్చినట్టు ఆమెపై కేసు నమోదైంది. మంగళవారం బెంగుళూరులోని లోకాయుక్త కోర్టులో జరిగిన విచారణకు శశికళ, ఆమె మరదలు (బంధువు) ఇళవరసి తరపు న్యాయవాదులు కూడా హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరికీ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారికి బెయిల్ పూచీకత్తు ఇచ్చిన వారికి కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను అక్టోబరు ఐదో తేదీకి వాయిదా వేసింది.