మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (13:39 IST)

రెబెల్ ఎమ్మెల్యేలకు భద్రత తగ్గింపు - ఏక్‌నాథ్ షిండే వార్నింగ్

eknath sinde
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఫలితంగా రోజుకో మలుపు తిరుగుతుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారేగానీ, ఒక మెట్టు దింగేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదేసమయంలో ఉద్ధవ్‌ను గద్దె దించేందుకు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెబెల్ ఎమ్మెల్యేలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. 
 
అదేసమంయంలో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నరు. ఈ క్రమంలో తమ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించిన 38 మంది ఎమ్మెల్యేల కుటుంబాలకు భద్రత తగ్గించినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఏక్‌నాథ్ షిండే ఓ లేఖ రాశారు. 
 
తమ కుటుంబాలకు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. భద్రత తొలగించడమంటే తమను భయపెట్టడమేనని చెప్పారు. ప్రభుత్వం తీరుతో తమ బంధువులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఇదే అంశంపై మహారాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు కూడా ఆయన లేఖ రాశారు. 
 
మరోవైపు, భద్రత ఉపసంహరణపై శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ స్పందించారు. ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నది ఎమ్మెల్యేలకు అని వారి కుటుంబ సభ్యులకు కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. పైగా, తమ పార్టీ చాలా పెద్దదని, దాన్ని ఎవ్వరూ హైజాక్ చేయలేరని అభిప్రాయపడ్డారు. 'మా రక్తం ధారపోసి నిర్మించిన పార్టీ ఇది. దీనికోసం అనేక మంది ఎన్నో త్యాగాలు చేశారు. డబ్బుతో ఎవరూ దాన్ని విచ్ఛిన్నం చేయలేరు' అని అన్నారు.