శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 మే 2020 (21:33 IST)

భారత్ లో రోజుకు 4.5 లక్షల పీపీఈ కిట్ల తయారీ!

కరోనా వైరస్ తొలిసారిగా వెలుగులోకి రాకముందు, ఇండియాలో రోజుకు ఒక్క పీపీఈ (పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కిట్ తయారీ కూడా జరగని స్థాయి నుంచి, ఇప్పుడు రోజుకు 4.5 లక్షల కిట్స్ ను తయారు చేసే సామర్థ్యాన్ని ఇండియా సంపాదించుకుంది.

ఇదే విషయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ, ప్రస్తుతం ఇండియాలో 600 కంపెనీలకు పీపీఈ కిట్స్ ను తయారు చేసేందుకు అనుమతి ఉందని తెలిపారు. మే 5 నాటికి రోజుకు 2.06 లక్షల కిట్స్ తయారు అవుతుండగా, ఆపై రెండు వారాల వ్యవధిలోనే తయారీ సామర్థ్యం రెట్టింపుకు పైగా పెరిగిందని తెలిపారు.
 
అంతకుముందు ఈ తరహా కిట్స్ ను దిగుమతి చేసుకుంటూ ఉన్న భారత్, కరోనా వెలుగులోకి వచ్చిన తరువాత, రెండు నెలల వ్యవధిలోనే స్వీయ తయారీ దిశగా అడుగులు వేసింది. పీపీఈ కిట్ లో ఓ మాస్క్, కంటికి రక్షణగా షీల్డ్, షూ కవర్, గౌన్, గ్లౌజ్ లు ఉంటాయి.

వీటిని కరోనా చికిత్సలో పాల్గొనే వైద్య బృందాలు ధరిస్తున్నారు. రెండు వారాల క్రితం కిట్లను తయారు చేసేందుకు 52 కంపెనీలకు అనుమతి ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 600కు చేరుకుందని స్మృతీ ఇరానీ వెల్లడించారు.
 
ఈ నెల ప్రారంభంలో మొత్తం 2.23 కోట్ల పీపీఈ కిట్స్ కు ఆర్డర్ ఇచ్చామని, వాటిల్లో 1.43 కోట్ల కిట్లను దేశవాళీ సంస్థలే తయారు చేస్తాయని, మరో 80 లక్షల కిట్లను దిగుమతి చేసుకోనున్నామని ఆమె వెల్లడించారు. కరోనాపై ముందు నిలబడి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ వీటిని అందించాలన్నదే లక్ష్యమని, ప్రస్తుతం గ్రామ స్థాయిల్లో ఉన్న చిన్న కంపెనీల్లో సైతం ప్రభుత్వం తరఫున వీటిని తయారు చేస్తున్నారని స్మృతీ ఇరానీ తెలిపారు.

లక్కవరం గ్రామంలో 200 మంది మహిళలు నిత్యమూ 15 వేల మాస్క్ లను, 6 వేల షూ కవర్స్ ను, 5 వేల ల్యాబ్ కోట్లను తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తున్నారని వెల్లడించారు. అలోక్ ఇండస్ట్రీస్, జేసీటీ ఫగ్వారా, గోక్లాడ్స్ ఎక్స్ పోర్ట్స్, ఆదిత్య బిర్లా తదితర కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి పీపీఈ కిట్స్ ను తయారు చేసి అందిస్తున్నాయి.