మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2020 (19:11 IST)

ప్రేయసి గదిలో ప్రియుడు.. అర్థరాత్రి చితక్కొట్టారు.. తెల్లారేసరికి అల్లుడిని చేసుకున్నారు..

ప్రేమ ఆ ఇద్దరిని అలా కలిపింది. పెళ్లికి ముందే అర్థరాత్రి పూట ఆ ప్రేమికులు ఇంట్లో రొమాన్స్ చేయడం తంతుగా కొనసాగించారు. ఇలా అర్ధరాత్రి వేళ ప్రియురాలి ఇంటికి వెళ్లి ప్రియుడు పట్టుబడ్డ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ప్రియురాలిని కలుసుకోవటానికి తరచూ అర్ధరాత్రి వేళ పొరుగు ఊరిలోని ఆమె ఇంటికి వస్తున్నాడు. ఆమె తన కుటుంబసభ్యులందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత ఇంటి వెనుక డోర్ తీసి ప్రియుడిని రప్పించుకుంటోంది. 
 
చాలా రోజులుగా ఈ తంతు సాగుతోంది. అర్థరాత్రి బాగా పొద్దుపోయేవరకు వారిద్దరూ రొమాన్స్ చేయడం, ఆ తర్వాత యువకుడు తాను వచ్చిన దారినే వెళ్లిపోవడం జరుగుతోంది. కానీ, అన్ని రాత్రులూ ఒక్కలా వుండదు కదా. మూడు రోజుల కిందట అర్ధరాత్రి అమ్మాయి గది నుంచి ఏదో అలికిడి వినిపించడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో వారిద్దరి బాగోతం బట్టబయలైంది. 
 
తమ అమ్మాయితో ఆ యువకుడు ఏకాంతంగా ఉండటం చూసి వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో అతడిని అదే గదిలో బంధించి చితక్కొట్టారు. ఆ అరుపులకు ఇరుగు పొరుగు వాళ్లు కూడా నిద్రలేచొచ్చారు. విషయం తెలుసుకొని తలో చెయ్యేశారు. దీంతో ఆ యువకుడికి ఆ రాత్రి కాళరాత్రిగా మారింది.
 
ఇక ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడంతో పాటు పెద్దలు కలుగ జేసుకోవడంతో తెల్లారేసరికి సీన్ మారిపోయింది. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదర్చడంతో మధ్యాహ్నమయ్యే సరికి వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. తాను తన్నులు తిన్నచోటే ఆ యువకుడు 24 గంటలు తిరిగేసరికి అల్లుడైపోయాడు. 
 
ఈ రొమాంటిక్ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఆ యువకుడి పేరు ప్రేమ్ సింగ్. అతడిది యూపీలోని రామ్‌పూర్ పరిధిలోని నగ్లీ గ్రామం. అతడి ప్రియురాలు ఉండేది అక్కడికి కొంత దూరంలోని సుమలీ గ్రామం మెహిందీ నగర్‌. ఆమె పేరు లక్ష్మి. అర్ధరాత్రి వేళ తమ అమ్మాయితో ఉన్న ప్రేమ్ సింగ్‌ను చితకబాదిన యువతి కుటుంబసభ్యులు ఆ మరుసటి రోజు పోలీసులకు అప్పగించారు. అతడిపై, అతడి కుటుంబసభ్యులపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో కథ ముగిస్తే ఇది మరోలా ఉండేది. కానీ, ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. 
 
విషయం తెలుసుకున్న అబ్బాయి, అమ్మాయి తరపు పెద్దలు పోలీస్ స్టేషన్‌లోనే పంచాయతీ పెట్టారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. అమ్మాయి కుటుంబసభ్యులు యువకుడిపై సారీ, తమకు కాబోయే అల్లుడిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకున్నారు. అక్కడికి సమీపంలోని ఓ ఆలయంలో వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించారు. యువకుడిని అమ్మాయి కుటుంబసభ్యులు చితకబాదిన దృశ్యాలు, ఆ తర్వాత వారిద్దరికీ పెళ్లి జరిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.