మృతి చెందిన వృద్ధుడు... గంగాజలం నోట్లో పోయగానే కళ్లు తెరిచాడు.. ఎక్కడ?
కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఓ వృద్ధుడు చనిపోయాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్మశానికి తీసుకెళ్లి చితిపై పడుకోబెట్టారు. చితిపై నిప్పంటించే సమయంలో ఆ వృద్ధుడు కళ్లు తెరిచి ఇక్కడెందుకు ఉన్నానంటూ ప్రశ్నించాడు. దీంతో వారంతా బిత్తరపోయారు. ఈ ఘటన ఢిల్లీలోని టిక్రీ ఖుర్ద్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేసింది.
ఈ వివరాలను పరిసీలిస్తే, సతీశ్ భరద్వాజ్ (62) అనే వృద్ధుడు కేన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. పైగా, ఆయ చనిపోయినట్టుగా 11 మంది వైద్యులు కూడా ధృవీకరించారు. దీంతో తమ కుటుంబ పెద్ద మృతితో కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత సోమవారం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
దహన సంస్కారాల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లారు. చితికి నిప్పు పెట్టే ముందు చనిపోయిన వృద్ధుడి నోట్లో గంగాజలం పోశారు. ఆ జలం నోట్లో పడిన వెంటనే ఆ వృద్ధుడిలో కదలిక కనిపించింది. ఆ వెంటనే కళ్లు తెరిచి మాట్లాడాడు. దీంతో షాక్ అయిన బంధువులు, కుటుంబ సభ్యులు ఆ వెంటనే తేరుకుని అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ నుంచి నరేలాలోని రాజాహరిశ్చంద్ర ఆస్పత్రికి తరలించగా, అక్కడ ఆయన్ను పరిక్షించిన వైద్యులు సతీశ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వెల్లడించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఎల్‌జే.నారాయణ్ ఆస్పత్రికి తరలించారు.