గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (08:55 IST)

అలా చేసేది సహజీవనం కాదు.. కామంతో చేసే వ్యభిచారం : పంజాబ్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

couples
తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండా, పెళ్ళికాని యువతితో పురుషుడు చేసేది సహజీవనం కాదని, అది కామంతో చేసే వ్యభిచారమని పంజాబ్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తాము సహజీవనం చేస్తున్నామని, అందువల్ల తమతమ కుటుంబాల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ ఓ జంట పంజాబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో పురుషుడికి ఇప్పటికే వివాహంకాగా, ఆ మహిళ అవివాహిత. తొలి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళతో కలిసి ఉండటం నేరమని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. 
 
పంజాబ్‌కు చెందిన ఓ పురుషుడు, మహిళ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. అతడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య నుంచి విడిగా ఉంటున్నాడు. అతడితో కలిసున్న మహిళకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే, కలిసి జీవిస్తున్న వారిద్దరూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కుల్దీప్ తివారీ ఏకసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించి ఎవరూ ఊహించని విధంగా వ్యాఖ్యలు చేశారు. 
 
'ఈ కేసులో పురుషుడు ఇంకా భార్య నుంచి విడాకులు తీసుకోలేదు. విడాకులు తీసుకోకుండా మరో మహిళతో కలిసి ఉంటే దాన్ని సహజీవనం అనరు. మరో మహిళతో కామంతో కూడిన వ్యభిచారం చేస్తున్నాడు అంటారు. సెక్షన్ 494/495 కింది ఇది నేరం. దీనికి శిక్ష కూడా ఉంటుంది. వ్యభిచారం కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడానికి సహజీవనం అంటూ ఈ పిటిషన్ వేసినట్టుంది' అంటూ జస్టిస్ కుల్దీప్ తివారీ మొట్టికాయలు వేశారు. అంతేకాదు, ఇలాంటి వ్యవహారాల్లో తాము రక్షణ కల్పించలేమని చెబుతూ వారి పిటిషన్‌ను కొట్టివేశారు.