శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2019 (16:26 IST)

లేటు వయస్సులో దాని కోసం రెండో పెళ్ళి చేసుకున్నాడు..

ఓ తండ్రి లేటు వయస్సులో తన ముర్ఖత్వపు ఆలోచనతో రెండో పెళ్లి చేసుకుని, మొదటి భార్యను, అలాగే పిల్లలను పట్టించుకోవడం మానేసాడు. నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ, ఆర్థికంగా స్థిరపడిన కుటుంబాలలో కూడా ఆడపిల్లల పట్ల చిన్నచూపు కొనసాగుతోంది. 
 
కర్ణాటకలోని బెళగావి తాలూకా కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ లేటు వయస్సులో తనకు ఉన్న దుర్బుద్ధిని బయటపెట్టాడు. బాళెగౌడ పాటిల్‌కి 25 ఏళ్ళ క్రితం మహాదేవి అనే మహిళతో పెళ్లైంది. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. కుమారుడు చిన్న వయస్సులోనే మరణించాడు. పెద్ద కుమార్తెకు ఇటీవలే వివాహం చేసాడు. అదే గ్రామంలో పాటిల్ తన భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తున్నాడు.
 
బాగా సాఫీగా సాగుతున్న జీవితంలో అతనికి ఏం దుర్బుద్ది పుట్టిందో ఏమో కానీ వారసుడు కావాలని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య పిల్లలను పట్టించుకోవడం మానేసాడు. కొత్త కాపురాన్ని కూడా సొంతూరు నుండి బెళగావికి మార్చేసాడు. కాగా మహాదేవి మాత్రం నర్సు ఉద్యోగం చేస్తూ కూతుళ్లను చదివిస్తోంది. 
 
అమ్మాయిల చదువు, కుటుంబ పోషణ ఆమెకు భారంగా మారింది. ఇదే క్రమంలో ఆ ఇద్దరు కూతుళ్లు తండ్రిని తీసుకురావడానికి అతడు ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం చూసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. గ్రామస్తులు కూడా అమ్మాయిలకు మద్దతుగా నిలిచారు. కుటుంబాన్ని వీధిపాలు చేసిన బాళెగౌడకు బుద్ధి చెప్పాలని పోలీసులను డిమాండ్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.