శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సుప్రీంకోర్టు సాక్షిగా నిప్పు అంటించుకున్న స్త్రీపురుషుడు

సుప్రీంకోర్టు సాక్షిగా ఓ పురుషుడు, స్త్రీ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. తమకు తామే నిప్పు అంటించుకున్నారు. దీన్ని గమనించిన అక్కడున్న వారు, పోలీసులు మంటలను ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. 
 
ఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రాంగణంలోని గేట్‌ డి వద్ద సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ ఘటన జరిగింది. ఒక పురుషుడు, మహిళ తమ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. రాజుకున్న మంటలతో సుప్రీంకోర్టు ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది.
 
గమనించిన అక్కడున్న వారు వెంటనే వారిపై నీళ్లు పోసి మంటలు ఆర్పారు. మంటలకు తీవ్రంగా కాలిన మహిళ ఆ వెంటనే కింద పడిపోయింది. ఆమె వెంట ఉన్న మగ వ్యక్తి కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. 
 
వెంటనే వారిద్దరిని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే వారిద్దరు ఎవరు, ఎందుకు నిప్పు పెట్టుకుని ఆత్మహత్యకు యత్నించారు అన్నది తెలియలేదు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.