బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (16:34 IST)

మణిపూర్ తగలబడిపోతుంటే ప్రధాని మోడీ జోకులు వేశారు : రాహుల్ ధ్వజం

rahul gandhi
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లతో ఆ రాష్ట్రం మండిపోతుంటే ప్రధాని నరేంద్ర మోడీ జోకులు వేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఓవైపు నెలల తరబడి ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ అల్లర్లతో మండుతుంటే.. ప్రధాని మాత్రం నవ్వుతూ, జోకులు వేశారని దుయ్యబట్టారు. ఆయన మాట్లాడిన తీరు తీవ్ర విచారకరమన్నారు.
 
'ప్రధాని మోడీ గురువారం లోక్‌సభలో 2 గంటల 13 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. కానీ, మణిపూర్‌ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే ప్రస్తావించారు. ఓవైపు అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో మణిపూర్‌ అట్టుడుకుతుంటే.. ప్రధాని పార్లమెంట్‌లో నవ్వుతూ, జోకులు వేస్తున్నారు. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ, ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని నేను చూడలేదు. ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు. ఆయన దేశ ప్రజలందరి ప్రతినిధి' అని రాహుల్ ధ్వజమెత్తారు.