మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2020 (09:40 IST)

90 రోజుల్లో 350 ఆన్ లైన్ క్లాసులు.. కేరళ యువతి ప్రపంచ రికార్డు

Kerala Woman
లాక్ డౌన్ కాలాన్ని ఓ యువతి ఇలా సద్వినియోగం చేసుకుంది. లాక్ డౌన్ రాగానే సొంత వ్యాపారాలపై కొందరు, ఆన్ లైన్ గేమ్స్ మీద కొందరు దృష్టి పెట్టారు. ఈ లాక్ డౌన్ కారణంగా దేశంలో స్వయం ఉపాధి కాస్త పెరిగిందనే చెప్పాలి. ఇలా లాక్ డౌన్ కాలాన్ని ఓ కేరళ యువతి ఆన్ లైన్ కోర్సులు చేసేందుకు ఉపయోగించుకుంది. ఈ క్రమంలో కేరళకు చెందిన ఆర్తి రఘునాథ్‌ 90 రోజుల్లో 350 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసి, ప్రపంచ రికార్డు సృష్టించింది.  
 
వివరాల్లోకి వెళితే.. ఆర్తి ఎంఇఎస్‌ కాలేజీలో ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మాలియక్కల్‌ మేదతిల్‌ ఎంఆర్‌ రఘునాథ్, తల్లి కళాదేవి. కోవిడ్‌-19 సృష్టించిన ఇబ్బందులతో ప్రజలు వివిధ కార్యకలాపాలు చేస్తూ తమ సమయాన్ని గడుపుతుండేవారు. ఆర్తి రఘునాథ్‌ మాత్రం చదువుకుంటూ కాలం గడిపింది. ఆర్తి కొచ్చిలోని ఏలంకరలో ఉంటుంది.
 
కరోనా కాలంలో మూడు నెలల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా అని ఆలోచించింది. ఆమె దృష్టి ఆన్ లైన్ కోర్సుల మీద పడింది. ఆన్‌లైన్‌లోనే లెక్చరర్ల సలహా తీసుకుని.. అలా ఆన్‌లైన్‌లోనే 350 కోర్సులు పూర్తి చేశానని చెప్పుకొచ్చింది. తాను చేసిన కోర్సులన్నీ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లోనేనని చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు ఇన్ని కోర్సులు చేసినవారు ఎవరూ లేకపోవడంతో తనపై ప్రపంచ రికార్డు నమోదైందని ఆర్తి సంతోషంగా వివరించింది. ఇలా ఆన్ లైన్ కోర్సులు చేయడం అంత సులువేం కాదని ఆమె తెలిపింది. 
 
ఇకపోతే.. ఆర్తి కోర్సులు తీసుకున్న విశ్వవిద్యాలయాలలో జాన్‌ హాకిన్స్, వర్జీనియా, కొలరాడో బౌల్డర్, కోపెన్‌ హాగన్, రోచెస్టర్, ఎమోరీ, కోర్సెరా ప్రాజెక్ట్‌ నెట్‌వర్క్, డెన్మార్క్‌ సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.