బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (09:33 IST)

హత్రాస్ మృతిరాలి పేరును వెల్లడించిన డిగ్గీ రాజా - స్వర భాస్కర్.. కేసు నమోదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ హత్యాచార మృతిరాలి పేరును వెల్లడించడంతో ఆయనపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, హీరోయిన్ స్వర భాస్కర్‌పై కూడా కేసు నమోదైంది. ఈమె కూడా మృతిరాలి పేరును వెల్లడించడంతో కేసు నమోదైంది. 
 
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, ఎవరూ అత్యాచార బాధితురాలి పేర్లను వెల్లడించకూడదు. అయితే, వీరిద్దరూ ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించారు. గత నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాత్రాస్‌లో ఓ దళిత బాలికపై మొక్కజొన్న పొలాల్లో దారుణంగా ప్రవర్తించిన నిందితులు, ఆమె మరణానికి కారణమైన సంగతి తెలిసిందే. 
 
ఇక, ఆమె పేరును, చిత్రాలను వెల్లడించిన వారిపై ఐపీసీ సెక్షన్ 228తో పాటు ఐటీ చట్టం సెక్షన్ 72 కింద కేసు పెట్టినట్టు సదాబాద్ సర్కిల్ ఆఫీసర్ తెలిపారు. కాగా, పోలీసులు కేసు పెట్టిన వారిలో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, హీరోయిన్ స్వరా భాస్కర్ తదితరులు ఉండటం గమనార్హం. అలాగే, వీరికి జాతీయ మహిళా కమిషన్ కూడా నోటీసులు జారీచేసింది.