శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (10:34 IST)

నీట్ పరీక్షలు నేడే.. ఒక గదిలో 12మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి

దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలు ఆదివారం జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నీట్ పరీక్షల కోసం రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నీట్ పరీక్ష జరగనుంది. దీని కోసం అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 151 పరీక్ష కేంద్రాలో 61,892 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కృష్ణ జిల్లాలో 16,200 మంది విద్యార్థుల కోసం 40 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
 
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. ఈసారి నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ పెట్టారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 
 
ఒక్క గదిలో కేవలం 12 మంది మాత్రమే పరీక్షలు రాసెలా అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు తమ వెంట లోపలికి తీసుకువెళ్లేందుకు మాస్క్, గ్లౌజులు, శానిటైజర్, ట్రన్స్పెర్నెంట్ నీళ్ల బాటిళ్లకు అనుమతి ఇచ్చారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
 
దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆదివారం నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌) జరుగనుంది. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి దాదాపు 55,800 విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారులు తెలిపారు. పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు జరుగుతుంది. 
 
పరీక్షా కేంద్రాలు మార్చుకున్న విద్యార్థులకు కొత్త హాల్‌టికెట్లను జారీచేశారు. కొత్త హాల్‌టికెట్లలో సూచించిన కేంద్రాల్లోనే విద్యార్థులు పరీక్ష రాయాలని ఎన్టీఏ స్పష్టంచేసింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌ జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటుచేశారు. కరోనా నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నీట్‌ పరీక్షకు భయపడి తమిళనాడులో శనివారం ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.