#నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జయంతి.. రామకృష్ణ పరమహంస, వివేకానందుని బాటలో..
నేడు నేతాజీ సుభాస్ చంద్ర బోస్ జయంతి. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్.. ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భరతమాతను రక్షించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. స్వాతంత్ర్యం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరిన నేతాజీ.. బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
అహింసామార్గం ఆంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసుకున్న బోస్ 1941లో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ముకొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. సాయుధ పోరాటంతో బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించారు. జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాల్లోని భారత జాతీయ సైనికదళానికి జీవం పోశారు.
1944 ఫిబ్రవరి 4న బర్మా రాజధాని రాంకూన్ నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత రెండేళ్లలో కోహిమా కోట, తిమ్మాపూర్- కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది.
రామకృష్ణ పరమహంస, వివేకానందుని బాటలో..
1879వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఒడిశాలోని కటక్‌లో జానకీ నాథ్, ప్రభావతీ బోస్ దంపతులకు నేతాజీ జన్మించారు. చిన్నతనం నుంచే విద్యలో రాణించారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుడి మార్గంలో పయనించారు. ''మానవసేవే మాధవసేవ'' అనే నినాదంతో ముందుకెళ్లారు.
తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేసి, ఇంగ్లండ్‌కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటుచేసుకుంది. ఐసీఎస్ శిక్షణ తీసుకున్నా అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.