గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (11:38 IST)

నాలుగు రోజుల శిశువును తొక్కి చంపిన కనికరం లేని ఖాకీలు.. ఎక్కడ?

Baby
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నాలుగు రోజుల శిశువును పాషాణ హృదయులైన కొందరు పోలీసులు కాళ్ళతో తొక్కి చంపేశారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ విచారణకు ఆదేశించారు. ఈ దారుణం జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలోని కోసాగోండోడిఘి గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డియోరి పోలీస్ స్టేషన్ పరిధిలో భూషన్ పాండే వృద్ధుడిపై ఒక కేసుకు సంబంధించిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. పోలీసుల రాకను పసిగట్టిన ఆ వృద్ధుడితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అక్కడ నుంచి పారిపోయారు. ఇంట్లోకి వెళ్ళి చూసిన పోలీసులకు చిన్న శిశువు మాత్రమే కనిపించింది. ఆ బిడ్డ నిద్రపోతుండటంతో కుటుంబ సభ్యులు ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లిపోయారు. 
 
ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు గాలించిన పోలీసులకు వారు ఎక్కడా కనిపించకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూడగా నాలుగున్నర నెలల శిశువు మరణించివుండంతో వారు బోరున విలపించసాగారు. నిద్రిస్తున్న చిన్నారిని పోలీసులు కాళ్ళతో తొక్కి చంపారని శిశువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వచ్చిన కథనాలపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందించారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.