శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (15:23 IST)

కరోనా విజృంభణ : మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూ... ఎక్కడ?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. కొత్తగా బుధవారం మరో 40 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో తాజాగా 570 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో ఐదుగురు చనిపోయారు.
 
దీంతో, అస్సాం ప్రభుత్వం మళ్లీ రాత్రిపూట కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఈ రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. గత వారం రోజుల్లో 10 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైన ప్రాంతాలు, కంటైన్మెంట్ జోన్లలో రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
 
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,554 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. రాత్రి 8 గంటల కల్లా హోటళ్లు, దాబాలు, దుకాణాలు, ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు 5,89,426 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,660 మంది మృతి చెందారు.