'నిర్భయ' దోషులకు ఉరి అమలు అనుమానమే... కొనసాగుతున్న స్వాతి మలివాల్ దీక్ష
నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలుచేయాలంటూ నిర్భయ తల్లి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణను అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌కుమార్ అరోరా ఈ నెల 17కి వాయిదా వేశారు. దీంతో ఈ నెల 16వ తేదీన దోషులకు ఉరిశిక్ష అమలు అనుమానాస్పదంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో అది సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు.
మరోవైపు, నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ చేపట్టిన దీక్ష 10వ రోజుకు చేరింది. రాజ్‌ఘాట్‌లోని సమతాస్థల్ వద్ద స్వాతి మలివాల్ దీక్ష కొనసాగిస్తున్నారు.
కాగా, శుక్రవారం దీక్షాశిబిరాన్ని నిర్భయ తల్లి సందర్శించి స్వాతికి మద్దతు తెలిపారు. నిర్భయకు న్యాయం జరుగాలంటూ స్వాతి మాలివాల్ గత 10 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిర్భయ దోషులకు త్వరగా ఉరిశిక్ష అమలుచేసి స్వాతి మలివాల్ దీక్ష విరమించేలా చూడాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
16నే ఉరితీయాలి : నిర్భయ తల్లి
తన కుమార్తెపై సామూహిక లైంగికదాడి జరిపి దారుణంగా హింసించిన దోషులను డిసెంబర్ 16లోపే (ఘటన జరిగిన రోజు) ఉరితీయాలని నిర్భయ తల్లి డిమాండ్ చేశారు. 'నిందితులకు కోర్టు ఉరిశిక్ష ప్రకటించి రెండున్నరేండ్లు అవుతున్నది. వారి రివ్యూ పిటిషన్లను కూడా తిరస్కరించి ఇప్పటికి 18 నెలలు కావస్తున్నది. అయినప్పటికీ వారిని ఉరితీయలేదు. దోషులను వెంటనే ఉరితీయాలని కోర్టును, ప్రభుత్వాన్ని కోరుతున్నా' అని తెలిపారు.