ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు ఎన్.ఎం.సి శుభవార్త..
ఉక్రెయిన్ దేశంలో గత ఫిబ్రవరి నెలలో రష్యా దేశం దండయాత్ర ప్రారంభించింది. ఇది ఇంకా కొనసాగుతూనే వుంది. ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకునే వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమతమ దేశాలకు తరలివెళ్లిపోయారు. ఇలాంటి వారిలో భారతీయ విద్యార్థులు కూడా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని వివిధ యూనివర్శిటీల్లో వైద్య కోర్సులు అభ్యసిస్తూ వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కౌన్సిల్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ వర్సిటీల్లో చదివిన వైద్య విద్యార్థులు ఇకపై భారత్‌లోని మెడికల్ కాలేజీల్లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లోనూ చేరేందుకు అనుమతించింది.
గతంలో విదేశీ వర్సిటీల్లో చదివే భారత విద్యార్థులు కోర్సు మధ్యలో కాలేజీ మారడం వీలయ్యేది కాదు. కోర్సు యావత్తు ఒకే కాలేజీలో చదవాల్సి వచ్చేది. ట్రైనింగ్, ఇంటర్న్ షిప్, అదే విదేశీ వర్సిటీలో పూర్తిచేయాల్సి వచ్చేది.
అయితే, వందల సంఖ్యలో వైద్య విద్యార్థుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఎన్ఎంసీ కాలేజీ బదిలీ వెసులుబాటు కల్పించింది. అటు, ఉక్రెయిన్ కూడా భారత విద్యార్థుల ట్రాన్సఫర్‌కు సమ్మతించినట్టు తెలుస్తోంది. ఈ బదిలీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర మెడికల్ కాలేజీల్లో చదివినప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఉక్రెయిన్‌లోని మాతృ కళాశాల పేరిటే మంజూరు చేస్తారని ఎన్ఎంసీ తాజా ప్రకటనలో వెల్లడించింది.